ఉగ్ర‌దాడి ముప్పు ఉంద‌ని హెచ్చ‌రించిన నిఘా వ‌ర్గాలు.. దుకాణాల్లో భారీగా త‌నిఖీల‌కు రాకేశ్‌ అస్థానా ఆదేశాలు

10-10-2021 Sun 13:14
  • వ‌రుస‌గా పండుగ‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో ఉగ్ర‌దాడులు జ‌రిగే చాన్స్‌
  • ముఖ్యంగా పెట్రోల్‌ పంపులు, ట్యాంకర్లే లక్ష్యం
  • కొత్తగా వచ్చి ఇళ్ల‌ను అద్దెకు తీసుకున్న వారిని పరిశీలించాలని ఆదేశాలు
  • అప్ర‌మ‌త్త‌మైన‌ పోలీసులు, భద్రతా బలగాలు  
delhi police on high alert
ఉగ్ర‌దాడి ముప్పు ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఢిల్లీలోని దుకాణాలు, షాపింగ్ మాల్స్, సైబ‌ర్ కేఫ్‌లు వంటి వాటిల్లో త‌నిఖీలు చేయాల‌ని పోలీసుల‌కు ఢిల్లీ న‌గ‌ర సీపీ రాకేశ్‌ అస్థానా ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంద‌న్న స‌మాచారంతో ఇప్ప‌టికే అక్కడి పోలీసులు, భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి.

నిన్న‌ సాయంత్రం ఉన్నతాధికారులతో రాకేశ్ అస్థానా సమీక్షా సమావేశం నిర్వహించారు. వ‌రుస‌గా పండగలు ఉన్న నేప‌థ్యంలో ఉగ్ర‌వాదులు భారీ దాడికి కుట్ర‌లు ప‌న్నే అవ‌కాశం ఉంద‌ని నిఘా వర్గాలు హెచ్చ‌రించాయ‌ని ఆయ‌న చెప్పారు. ఉగ్ర‌వాదుల చ‌ర్య‌ల‌ను అరికట్టడానికి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు. స్థానికుల సహకారం లేకుండా ఉగ్రవాదులు ఈ దుశ్చర్యలకు పాల్పడే అవకాశం లేదని ఆయన చెప్పారు.

ఉగ్ర‌వాదుల కుట్ర‌ల‌ను భ‌గ్నం చేయ‌డానికి వారికి స్థానికుల సాయం అందకుండా నిరోధించాల్సిన అవసరం ఉంద‌ని తెలిపారు. ఉగ్ర‌వాదులు ముఖ్యంగా పెట్రోల్‌ పంపులు, ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకునే సంకేతాలు ఉన్నాయని వివ‌రించారు. ఇటీవల కొత్తగా వచ్చి ఇళ్ల‌ను అద్దెకు తీసుకున్న వారిని పరిశీలించాలని చెప్పారు.