‘మా’లో విభేదాల్లేవు.. ప్రకాశ్ రాజ్, విష్ణులు అన్నదమ్ములు: నందమూరి బాలకృష్ణ

10-10-2021 Sun 11:15
  • ఓటు హక్కును వినియోగించుకున్న హీరో
  • ఇద్దరూ మంచి చేసేలా ఉన్నారని కామెంట్
  • ‘మా’ అంతిమ లక్ష్యం కళాకారుల సంక్షేమమే
Prakash Raj And Vishnu Are Brothers Alike Says Balakrishna

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలన్నాక ఈ మాత్రం హడావుడి ఉంటుందని, కానీ, ఇప్పుడున్నంత హడావుడి గతంలో ఎన్నడూ లేదని ఆయన గుర్తు చేశారు. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, విష్ణులు అన్నదమ్ముల్లాంటివారని ఆయన చెప్పారు. వారిద్దరినీ చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేలా ఉన్నారని అన్నారు. ఇద్దరూ మాటలు చెప్పేవారు కాదని, చేతల్లో చూపించేవారని చెప్పారు.

కాబట్టి గెలిచిన వారూ చేతల్లో చూపించాలన్నారు. తమలో తమకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. షూటింగుల్లో అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటామని, ‘మా’ అంతిమ లక్ష్యం కళాకారుల సంక్షేమమేనని చెప్పుకొచ్చారు. ఎవరు గెలిచినా ప్రోత్సహిస్తామని, ఎవరు మంచి చేస్తారని భావించానో వారికే తాను ఓటేశానని బాలకృష్ణ తెలిపారు. గెలిచిన వారు పేద, మధ్యతరగతి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కళాకారుల అవసరాలు, ఇన్సూరెన్సులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.