ఆఫ్ఘనిస్థాన్‌లో ఐసిస్ ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభం

10-10-2021 Sun 06:52
  • తాలిబన్లకు తలనొప్పిగా మారిన ఐసిస్ ఉగ్రవాదులు
  • జబీహుల్లా తల్లి సంస్మరణ కార్యక్రమంపై దాడులు
  • తరిమికొడుతున్నామన్న జబీహుల్లా
Taliban starting fight against ISIS terrorists

ఆఫ్ఘనిస్థాన్‌లో తమకు తలనొప్పిగా మారిన ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు తాలిబన్లు నడుంబిగించారు. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తల్లి సంస్మరణ కార్యక్రమాన్ని ఇటీవల కాబూల్ మసీదు వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దీంతో ఐసిస్‌పై తాలిబన్లు కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు.

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులను అణచివేస్తామని ఈ సందర్భంగా జబీహుల్లా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌కు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి మప్పు పొంచి ఉందన్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ఐసిస్ పనులు తమకు తలనొప్పిగా మారాయని అన్నారు. వారిని తరిమికొడుతున్నట్టు చెప్పారు. కాగా, కాబూల్ శివారులో ఐసిస్ ఖొరసాన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపినట్టు స్థానిక మీడియా తెలిపింది.