తైవాన్ పై చైనా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపేసుకుంటామని హెచ్చరిక

09-10-2021 Sat 13:42
  • మాతృభూమి పునర్నిర్మాణం చేస్తామని వెల్లడి
  • శాంతి యుతంగా కలిపేసుకుంటామని కామెంట్
  • అది తైవాన్ ప్రజలకే మంచిదని వార్నింగ్
  • శాంతి అంటూనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు
China Wants Peaceful Re Unification Of Taiwan Says President Xi Jinping

చైనా ఆక్రమిత ధోరణికి హద్దుల్లేకుండా పోతున్నాయి. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్ ను చెరబట్టేసిన డ్రాగన్.. అవే మంటలను తైవాన్ తో పాటు భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, సిక్కింలపైనా వెళ్లగక్కుతోంది. ఎక్కడికక్కడ చొరబాట్లకు దిగుతోంది. మొన్నటికి మొన్న అరుణాచల్ ప్రదేశ్, తూర్పు లడఖ్ లో మళ్లీ చొరబాట్లకు ప్రయత్నించింది.

మరోపక్క, తైవాన్ పైకి భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను పంపిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతూనే శాంతి మంత్రం జపిస్తోంది. 1911లో సామ్రాజ్యవాద పాలన అంతానికి కారణమైన ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు.

తాజాగా ఆ దేశాధ్యక్షుడు తైవాన్ పై నేరుగా రెచ్చొగట్టే వ్యాఖ్యలు చేశారు. తైవాన్ ను శాంతియుతంగా చైనాలో కలిపేసుకోవడమే తమ ఎజెండా అని జిన్ పింగ్ అన్నారు. వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే గొప్ప సంస్కృతి ఉన్న వారు చైనీయులని అన్నారు.

‘‘తైవాన్ మా మాతృభూమిలోని భాగమే. ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ వేర్పాటు వేదాన్ని కోరుకుంటున్న తైవాన్ ను మాలో కలుపుకోవడమే అతిపెద్ద సవాల్ గా మారింది. అది దేశ పునరుత్తేజానికి అతి ప్రమాదకారి’’ అని చెప్పారు. శాంతియుతంగా తమలో కలిస్తేనే తైవాన్ ప్రజలకు మంచిదని సూచించారు.

దేశ సార్వభౌమత్వం, సమగ్రత విషయంలో చైనా ప్రజల సంకల్పం, దృఢ చిత్తం, చేయగలమన్న ధీమాను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తైవాన్ ను తమలో కలిపేసుకుంటామని తేల్చి చెప్పారు. కాగా, ఐలాండ్ దేశంపై వైమానిక దాడులు చేసైనా తమ అధీనంలోకి తెచ్చుకుంటామని 2019లో జిన్ పింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

దీంతో పోరాడేందుకు తామూ సిద్ధమేనని, చైనాలో కలువబోమని తైవాన్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. తాజాగా వారం రోజులుగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ పై చక్కర్లు కొడుతుండడం.. మరికొన్ని రోజుల్లో చైనా సైనిక చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయన్న చర్చకు దారి తీసింది. ఇప్పుడు చైనా అధ్యక్షుడే నేరుగా దాని మీద కామెంట్ చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.