మెగా హీరోలు నాకే సపోర్ట్ చేస్తున్నారు.. బన్నీ, నేను చాటింగ్ చేసుకుంటాం: మంచు విష్ణు

09-10-2021 Sat 11:39
  • మెగా హీరోలతో నా అనుబంధం ఇప్పటిది కాదు
  • బన్నీ, చరణ్ లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్
  • శిరీశ్ తమ్ముడైతే.. తేజ్ చిన్న తమ్ముడు
  • నాకు వారి సపోర్ట్ లేదనడం అబద్ధం
  • ప్రకాశ్ రాజ్, నాగబాబుకు వార్నింగ్
  • తన ఫ్యామిలీ జోలికొస్తే ఎవరైనా వదిలిపెట్టనని హెచ్చరిక
Have Mega Heros Support Reveals Manchu Vishnu

తెల్లారితే ‘మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)’ ఎన్నికలు. గెలుపు కోసం ఇటు మంచు విష్ణు వర్గం, అటు ప్రకాశ్ రాజ్ వర్గం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విమర్శలు వ్యక్తిగత విషయాలదాకా వెళ్లాయి. ఇటీవల తన ఫ్యామిలీపై వస్తున్న విమర్శల పట్ల విష్ణు సీరియస్ అయ్యారు.

ఓ ఇంటర్వ్యూలో నాగబాబుకు, ప్రకాశ్ రాజ్ కు వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం జోలికొస్తే.. తనేంటో చూపిస్తానని హెచ్చరించారు. ఎవ్వరినీ క్షమించే ప్రసక్తే లేదన్నారు. పవన్ కల్యాణ్ కు కోపం వస్తే వార్ వన్ సైడ్ అవుతుందన్న నాగబాబు కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. డైలాగ్ బాగుందని, దానిని తన తర్వాతి సినిమాలో వాడుకుంటానని అన్నారు.

మెగా ఫ్యామిలీ హీరోలు తనకు మంచి స్నేహితులని విష్ణు చెప్పుకొచ్చారు. బన్నీ, చరణ్ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. బన్నీ, తాను తరచూ చాటింగ్ చేసుకుంటూ ఉంటామన్నారు. శిరీశ్ తన తమ్ముడైతే.. తేజ్ చిన్న తమ్ముడన్నారు. చరణ్, మనోజ్, తన సోదరి లక్ష్మి మంచి మిత్రులన్నారు. వారు తరచూ కలుస్తుంటారని, తాను ఎక్కువగా కలవనని తెలిపారు. మెగా హీరోలతో తనది ఇప్పటి అనుబంధం కాదని, తాను చెప్పిన వారంతా తనకే సపోర్ట్ చేస్తున్నారని విష్ణు తెలిపారు. విష్ణుకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదన్న ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని ఆయన చెప్పారు.  

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వ్యక్తి తెలుగువ్యక్తి కాదని, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిలయ్యారని అన్నారు. ఆయన పేరు కూడా పలకడం ఇష్టం లేదన్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమస్యలను చక్కదిద్దడానికే ఇక్కడికొచ్చానంటూ ఆయనంటున్నారని, అంత అవసరం లేదని అన్నారు. తమ సమస్యలను తాము పరిష్కరించుకోగలమని చెప్పారు. వాటిని సరిచేయడానికి ఇక్కడ చాలా మంది పెద్దవారున్నారని, వారందరి తరఫున సమాధానం చెప్పేందుకు తానొక్కడిని చాలని అన్నారు. మరోసారి ఆ వ్యక్తి తన కుటుంబం గురించి మాట్లాడితే వదిలిపెట్టేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ప్రతిసారీ తన తండ్రి పేరునే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చాలా మంది తనను అడుగుతున్నారని, ఆ ప్రశ్నను పవన్ కల్యాణ్ నే అడగాలని విష్ణు అన్నారు. వారిద్దరి మధ్యా ఎలాంటి ఇగో సమస్యలు లేవన్నారు. ఇటీవల రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమాను తన తండ్రి మెచ్చుకున్నారని, పవన్ కు ఫోన్ చేసి అభినందించారని చెప్పారు. బాగా నటించావ్ అంటూ పవన్ కు చెప్పారన్నారు. అందుకు ‘మీ లాంటి పెద్దలు ఫోన్ చేసి మెచ్చుకోవడం నాకెంతో సంతోషం’ అని పవన్ బదులిచ్చారని చెప్పారు. కావాలంటే పవన్ ను అడగొచ్చని అన్నారు.