CM Jagan: ఇంధన సంక్షోభంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్

  • రాష్ట్రంలో విద్యుత్ కొరత నెలకొందన్న సీఎం జగన్
  • బొగ్గు నిల్వలు నిండుకున్నాయని వెల్లడి
  • రాష్ట్రానికి తగినన్ని కోల్ రేక్ లు కేటాయించాలని విజ్ఞప్తి
  • సహజవాయువును కూడా కేటాయించాలని వినతి
CM Jagan wrote PM Modi

ఇంధన సంక్షోభం, విద్యుత్ కొరత అంశంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని తెలిపారు. కరోనా సంక్షోభం తర్వాత విద్యుత్ వినియోగం గత నెల రోజుల వ్యవధిలో 20 శాతం పెరిగిందని సీఎం జగన్ తన లేఖలో నివేదించారు. ఏపీ జెన్ కో 45 శాతమే రాష్ట్ర అవసరాలు తీర్చగలుగుతోందని వివరించారు.

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ఇంధన రంగంలో సంక్షోభం నెలకొని ఉందని, యూరప్ దేశాలు, చైనాలో విద్యుత్ ధరలు మూడింతలు పెంచారని, ఇప్పుడీ పరిస్థితి భారత్ ను కూడా వేధిస్తోందని సీఎం జగన్ వివరించారు. ఏపీలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుతోందని, ఈ సమయంలో కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు.

ఏపీకి కేంద్రం నుంచి 20 బొగ్గు రేక్ లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు వీలుగా... దేశంలో నిలిచిపోయిన థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో మళ్లీ ఉత్పాదన షురూ చేయాలన్నారు.

ఏపీలో నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ఒఎన్జీసీ, రిలయన్స్ నుంచి కేటాయించాలని వివరించారు. అటు, నష్టాల్లో ఉన్న డిస్కంలను ఆదుకునేలా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News