ఐపీఎల్ లో నేడు ఒకేసారి రెండు మ్యాచ్ లు ప్రారంభం

08-10-2021 Fri 19:30
  • అబుదాబిలో ముంబయి వర్సెస్ హైదరాబాద్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి
  • దుబాయ్ వేదికగా ఢిల్లీ వర్సెస్ బెంగళూరు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
Two matches at same time in IPL today

ఐపీఎల్ తాజా సీజన్ లో లీగ్ దశ పోటీలు నేటితో ముగియనున్నాయి. కాగా, నేడు ఒకే సమయంలో రెండు మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. నేటి మ్యాచ్ లలో ముంబయి ఇండియన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది.

ముంబయి-హైదరాబాద్ మ్యాచ్ కు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరులో సన్ రైజర్స్ జట్టుకు మనీష్ పాండే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ సారథి కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతుండడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. గాయంతో బాధపడుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చారు.

ముంబయి జట్టు తరఫున పియూష్ చావ్లా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. సౌరభ్ తివారీ, జయంత్ యాదవ్ లను తప్పించిన ముంబయి యాజమాన్యం పియూష్ చావ్లా, కృనాల్ పాండ్యలకు చోటిచ్చింది.

ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ లీగ్ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు.

అటు ఆర్సీబీ జట్టు కూడా మార్పుల్లేకుండానే బరిలో దిగుతోందని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అయితే డాన్ క్రిస్టియన్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపేందుకు యోచిస్తున్నామని వివరించాడు.