'క్లాప్' నుంచి ఇళయరాజా సాంగ్ రిలీజ్!

08-10-2021 Fri 18:54
  • ఆది పినిశెట్టి హీరోగా 'క్లాప్'
  • సంగీత దర్శకుడిగా ఇళయరాజా
  • రామజోగయ్య శాస్త్రి సాహిత్యం
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
Clap song released

మొదటి నుంచి కూడా ఆది పినిశెట్టి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున విలన్ పాత్రలతోను మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా చేసిన సినిమానే 'క్లాప్'. ఈ సినిమాలో కథానాయికలుగా ఆకాంక్ష సింగ్ .. కురుప్ క్రిష కనిపించనున్నారు.

రామాంజనేయులు - రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఇళయరాజా సంగీతాన్ని అందించడమే కాకుండా ఆయనే ఈ సినిమాలో ఒక పాట కూడా పాడారు. ఇప్పుడు ఆ పాటనే లిరికల్ వీడియోగా వదిలారు.

'మనసుతో చూడలేని మార్గమే లేదురా .. కలలు ఉప్పొంగిపోని కన్ను నిరుపేదరా' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో నడుస్తుంది. తన తనయుడి వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ .. ఆశయం దిశగా అతనిని నడిపిస్తూ ఒక తండ్రి పాడుతున్నట్టుగా వచ్చే పాట ఇది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.