ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలు నన్ను అడగొద్దు: 'మా' ఎన్నికలపై రోజా స్పందన

08-10-2021 Fri 18:02
  • అక్టోబరు 10న 'మా' ఎన్నికలు
  • తీవ్రస్థాయిలో ప్రచారం
  • నువ్వానేనా అంటున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు
  • కచ్చితంగా ఓటు వేస్తానని రోజా వెల్లడి
YCP MLA Roja opines on MAA Elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో, ప్రధాన ప్యానెళ్లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓవైపు ప్రకాశ్ రాజ్ వర్గం, మరోవైపు మంచు విష్ణు వర్గం పరస్పరం ఆరోపణలు, విమర్శలతో వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఒకప్పటి అగ్ర హీరోయిన్లలో ఒకరైన వైసీపీ ఎమ్మెల్యే రోజా 'మా' ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అంటూ ప్రచారం జరుగుతోందని, మీ ఓటు లోకల్ కా, నాన్ లోకల్ కా? అని ఓ మీడియా ప్రతినిధి రోజాను ప్రశ్నించారు. దీనిపై రోజా స్పందించారు.

ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలు తనను అడగొద్దని స్పష్టం చేశారు. దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. 'మా' ఎన్నికలు చూస్తుంటే సాధారణ ఎన్నికలను మించిపోయాయని, పరిస్థితి తీవ్రస్థాయిలో ఉందని రోజా అభిప్రాయపడ్డారు.

తాను కూడా సినీ కళాకారిణిగా ఓటు హక్కు వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. ఎవరి ప్యానెల్ తో 'మా' అభివృద్ధి సాకారమవుతుందో, నటీనటులకు మేలు జరుగుతుందో ఆ ప్యానెల్ కు ఓటు వేస్తానని వెల్లడించారు. ఇరు వర్గాలు మేనిఫెస్టోలు విడుదల చేశారు కాబట్టి, ఏది మెరుగైన మేనిఫెస్టో అనిపిస్తే దానికే తన మద్దతు అని తెలిపారు.