నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు .. మొదలైన ఫస్టు మూవీ షూటింగ్!

08-10-2021 Fri 17:55
  • కోడి దివ్యదీప్తి నిర్మాతగా సినిమా
  • హీరోగా కిరణ్ అబ్బవరం
  • కథానాయికగా సంజన ఆనంద్ పరిచయం
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ  
Kodi Divya deepthi first movie as a producer

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ. గ్రామీణ నేపథ్యంలోని కథలతో .. కుటుంబ బంధాలకు ప్రాధాన్యతనిచ్చే కథలతో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన కూతురు దివ్యదీప్తి ఇప్పుడు నిర్మాతగా మారారు. సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని ఒక సినిమాను నిర్మిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం - సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో, హీరోయిన్లపై నిర్మాత రామలింగేశ్వరరావు క్లాప్ ఇవ్వగా .. ఎ.ఎమ్.రత్నం కెమెరా స్విచ్ఛాన్ చేయగా .. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు, అల్లు అరవింద్ .. మురళీ మోహన్ .. ఎస్వీ కృష్ణారెడ్డి .. అచ్చిరెడ్డి హాజరయ్యారు. కోడి దివ్యతో పాటు ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.