ఆఫ్ఘనిస్థాన్ లో మసీదుపై ఆత్మాహుతి దాడి... 100 మంది మృతి!

08-10-2021 Fri 17:46
  • ఆఫ్ఘన్ గడ్డ మరోసారి రక్తసిక్తం
  • కుందుజ్ నగరంలో ఉగ్రదాడి
  • ప్రార్థనలు చేస్తున్న షియా ముస్లింలే లక్ష్యంగా దాడి
  • ఐసిస్-కె ఉగ్రవాద సంస్థపై అనుమానాలు
Terror attack in Afghanistan

తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్ భవితవ్యంపై అంతర్జాతీయ సమాజం వెలిబుచ్చుతున్న ఆందోళనలే నిజమవుతున్నాయి. ఇప్పుడక్కడ సామాన్య ప్రజల ప్రాణాలకు ఏమాత్రం భద్రత లేకుండాపోయింది.

ఆఫ్ఘనిస్థాన్ లోని ఈశాన్య ప్రాంత నగరం కుందుజ్ లో నేడు భారీ ఉగ్రదాడి జరిగింది. ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మంది వరకు చనిపోయారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. షియా ముస్లింలు మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. దీనిపై తాలిబన్ల ప్రత్యేక బృందం ఘటనస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తుందని తెలిపారు.

కాగా కుందుజ్ లోని ఆసుపత్రులకు తీసుకువస్తున్న క్షతగాత్రుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని ఓ వైద్యుడు తెలిపారు. కాగా ఈ దాడికి పాల్పడింది ఐసిస్-కె (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్)గా భావిస్తున్నారు. ఇటీవల షియా ముస్లిం వర్గానికి ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ నుంచి పలు హెచ్చరికలు వచ్చినట్టు తెలుస్తోంది. దాడికి తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు.