సీఎం జగన్ ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు ఇస్తున్నారు: మంత్రి బొత్స

08-10-2021 Fri 16:26
  • ఏపీలో టిడ్కో ఇళ్ల పంపిణీ
  • నెల్లూరు భగత్ సింగ్ నగర్ లో కార్యక్రమం
  • హాజరైన బొత్స, అనిల్ కుమార్
  • గత ప్రభుత్వం పేదలను మోసం చేసిందన్న బొత్స
AP Minister Botsa praises CM Jagan
టిడ్కో ఇళ్లపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాబోయే 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్లను ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు 2,62,000 టిడ్కో ఇళ్లను సిద్ధం చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం  పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసిందని, ఇళ్ల నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. కానీ సీఎం జగన్ ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లను ఇస్తున్నారని బొత్స వివరించారు. పేదలపై భారం పడనివ్వకుండా రూ.7 వేల కోట్లను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.

నెల్లూరు భగత్ సింగ్ నగర్ లో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనా దక్షతకు టిడ్కో ఇళ్లే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు మంత్రులు తాళాలు అందజేశారు.