ఎవరైనా కాకినాడ వచ్చి ప్రశ్నిస్తే ఇసుక లారీలతో తొక్కిస్తావా?... ఒకసారి కాదు పదిసార్లు వస్తాం!: టీడీపీ నేత పట్టాభి

07-10-2021 Thu 17:21
  • ఇటీవల గుజరాత్ లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
  • ఏపీతో లింకులున్నాయంటూ ప్రచారం
  • వైసీపీ నేతలపై టీడీపీ ధ్వజం
  • ద్వారంపూడికి దీటుగా బదులిచ్చిన పట్టాభి
TDP Leader Pattabhi fires on YCP MLA Dwarampudi
ఇటీవల గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది మొదలు, వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ అడిగిన ప్రశ్నలకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. తిరిగి టీడీపీ నేతలపైనే ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ద్వారంపూడితో పాటు శాన్ మెరైన్ ఎండీ అలీషా, సుధాకర్ లను ఎన్ఐఏ విచారించాలని డిమాండ్ చేశారు.

"ఏమయ్యా ద్వారంపూడి... నిన్న మేం అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము లేదు నీకు! ఎవరన్నా కాకినాడ వచ్చి నిన్ను ప్రశ్నిస్తే ఇసుక లారీలతో తొక్కించేస్తానంటావా? ఒకసారి కాదు, పదిసార్లు కాకినాడ వస్తాం" అంటూ పట్టాభి సవాల్ విసిరారు.