Umran Malik: గంటకు 153 కిమీ వేగం... సన్ రైజర్స్ అమ్ములపొదిలో సరికొత్త పేస్ అస్త్రం ఉమ్రాన్ మాలిక్!

Sunrisers new pace sensation Umran Malik impressed a lot
  • నిన్నటి మ్యాచ్ లో నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్
  • 21 ఏళ్ల మాలిక్ స్వరాష్ట్రం జమ్మూ కశ్మీర్
  • దేశవాళీల్లో కేవలం రెండు మ్యాచ్ లే ఆడిన వైనం
  • ప్రతిభను గుర్తించిన సన్ రైజర్స్ యాజమాన్యం
నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూసినవారు కొత్త కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చూసి ఎంతో విస్మయానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. చూడ్డానికి సాధారణంగా కనిపించే ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో విసిరిన ఓ బంతి గంటకు 153 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్టు స్పీడ్ ట్రాకర్ పై కనిపించింది.

ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ తీసింది ఒక్క వికెట్టే అయినా, పరుగులు కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. బెంగళూరు  కెప్టెన్ కోహ్లీ సైతం ఉమ్రాన్ బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. దీర్ఘకాలంలో అతడి పురోగతిని పరిశీలించాలని, టీమిండియాకు భవిష్యత్ పేస్ అస్త్రం అయ్యే లక్షణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
కోహ్లీ మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఉమ్రాన్ వయసు ప్రస్తుతం 21 ఏళ్లే. జమ్మూ కశ్మీర్ కు చెందినవాడు. దేశవాళీ క్రికెట్లో అతడు ఆడింది రెండు మ్యాచ్ లే. బెంగాల్ జట్టుతో విజయ్ హజారే మ్యాచ్ సందర్భంగా జమ్మూ కశ్మీర్ తరఫున అరంగేట్రం చేశాడు.

ఆ తర్వాత రైల్వేస్ జట్టుతో ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే అతడిలోని పేస్ ను గుర్తించిన సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ జట్టులోకి తీసుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో వికెట్లేమీ పడగొట్టకపోయినా, కొద్దిమేర ప్రభావం చూపించాడు. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో శ్రీకర్ భరత్ ను అవుట్ చేసి జట్టుకు ఉత్సాహాన్నందించాడు.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఉత్కంఠ విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు జరిగాయి. పెద్ద ఖడ్గంతో ఉమ్రాన్ మాలిక్ తో కేక్ కట్ చేయించి, అతడిని అందరూ అభినందించారు.
Umran Malik
Pacer
SRH
Jammu And Kashmir
Virat Kohli
IPL

More Telugu News