62 ఏళ్ల వయసులో భార్యపై కక్ష పెంచుకున్న భర్త.. మానవబాంబుగా మారి మట్టుబెట్టిన వైనం!

07-10-2021 Thu 08:30
  • మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో ఘటన
  • దుస్తుల్లో జిలెటిన్ స్టిక్స్ చుట్టుకుని భార్యను కౌగిలించుకున్న భర్త
  • భారీ శబ్దంతో దద్దరిల్లిన మార్కెట్
62 yr old man kills wife in suicide bomb attack in Mizoram
మనస్పర్థలతో భార్యపై కక్ష పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించేందుకు మానవబాంబుగా మారాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకుని బాంబును పేల్చాడు. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. మిజోరంలోని లుంగ్‌లేయీ పట్టణంలో జరిగిందీ ఘటన.

రోహ్మింగ్లియానా (62), ట్లాంగ్థియాన్‌ఘ్లిమి (61) భార్యాభర్తలు. ఆమె స్థానికంగా కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. అతడు మాత్రం పనీపాట లేకుండా తరచూ భార్యను వేధించడమే పనిగా పెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న రోహ్మింగ్లియానా భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగా దుస్తుల లోపల జిలెటిన్ స్టిక్స్ చుట్టుకుని భార్య కూరగాయలు విక్రయించే మార్కెట్‌కు వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అమాంతం ఆమెను కౌగిలించుకుని మీట నొక్కాడు. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. పేలుడు సమయంలో వారి కుమార్తె కొద్ది దూరంలో ఉండడంతో ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ ఘటనలో మరెవరికీ అపాయం సంభవించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.