East Godavari District: టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరుల దాడి

Dwarampudi fallowers attacked tdp leaders in east godavari
  • డ్రగ్స్ దిగుమతిలో ద్వారంపూడి హస్తం ఉందన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్
  • గత నెలలో దగ్ధమైన బోటులో హెరాయిన్ ఉందని ఆరోపణ
  • సీ పోర్టును పరిశీలించిన టీడీపీ నేతలు
  • టీడీపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ శ్రేణులు
  • బయటకు వస్తున్న నవీన్, కొండబాబుపై దాడి
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న టీడీపీ నేతలు కొండబాబు, నవీన్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి మద్దతుదారులు, బోటు నిర్వాహకులు, వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

అంతకుముందు ఏం జరిగిందంటే.. మాజీ మంత్రి చినరాజప్ప, జడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి తదితర అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి డ్రగ్స్ దిగుమతిలో ఆయన హస్తం ఉందన్నారు. అలాగే, గత నెలలో కాకినాడ జగన్నాథపురం వద్ద ఉప్పుటేరులో బోటు దగ్ధమైన సమయంలో తెల్లటి పొగలు రావడానికి హెరాయినే కారణమని ఆరోపించారు. అయినప్పటికీ పోలీసులు విచారణ చేపట్టడం లేదని మండిపడ్డారు.

అనంతరం సీ పోర్టులో పర్యటించిన టీడీపీ బృందం పార్టీ కార్యాలయానికి చేరుకుంది. కాసేపటి తర్వాత పార్టీ నేతలు కొండబాబు, నవీన్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ద్వారంపూడి అనుచరులు, బోటు నిర్వాహకులు వారిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వారిద్దరినీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు, బోటు నిర్వాహకులు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
East Godavari District
Kakinada
Dwarampudi Chandrasekhar Reddy
Attack
TDP
YSRCP

More Telugu News