Rahul Gandhi: రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీకి బ‌య‌లుదేరిన కాంగ్రెస్ నేత‌ల బృందం

  • ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన బృందం
  • పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌
  • మండిప‌డ్డ రాహుల్ గాంధీ
rahul gandhi to reach lakhimpur

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లఖింపూర్ ఖీరీలో రైతుల‌పైకి కారును ఎక్కించిన ఘ‌ట‌నలోను, తదనంతర హింసలోనూ ప‌లువురు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే బాధిత కుటుంబాల‌ను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.

మరోపక్క, ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీ నుంచి యూపీకి కాంగ్రెస్ కీల‌క నేత‌ల బృందం బ‌య‌లుదేరింది. అయితే, వారి పర్యటనకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఉత్కంఠ నెల‌కొంది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న‌ కేంద్ర‌మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను పోలీసులు ఇప్ప‌టికీ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి.

పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో యూపీ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్న‌దాత‌ హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వ్యాఖ్యానించారు. నిన్న‌ యూపీ వెళ్లిన ప్రధాని మోదీ లఖింపూర్‌ను ఎందుకు సందర్శించలేదని ఆయ‌న నిల‌దీశారు. ఇదిలావుంచితే, ప్రభుత్వం అనుమ‌తి నిరాక‌రించిన‌ప్ప‌టికీ, వీరు యూపీకి వెళ్తున్నారు. కాసేప‌ట్లో ఆయ‌న బృందం యూపీ చేరుకోనున్న నేప‌థ్యంలో వారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News