దేవుడు కలలోకి వచ్చి ఏం కావాలన్నాడు... 'మా' సభ్యుల సంక్షేమం కోరుకుని పోటీ నుంచి తప్పుకున్నా!: సీవీఎల్

05-10-2021 Tue 17:05
  • 'మా' ఎన్నికల వ్యవహారం
  • ఇటీవల పోటీ నుంచి విరమించుకున్న సీవీఎల్
  • నేడు ప్రెస్ మీట్
  • తన నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టీకరణ
CVL explains what happened behind his decision

'మా' ఎన్నికల బరి నుంచి ఇటీవల తప్పుకున్న నటుడు సీవీఎల్ నరసింహారావు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఎందుకు 'మా' ఎన్నికల నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్నదీ వెల్లడించారు. దేవుడు కలలోకి వచ్చాడని, 'మా' అధ్యక్ష పదవి కావాలా? లేక 'మా' సభ్యుల సంక్షేమం కావాలా? అని అడిగాడని తెలిపారు. తాను 'మా' సభ్యుల సంక్షేమం కావాలని కోరుకున్నానని వివరించారు. అందుకే 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకున్నానని, ఇందులో ఒత్తిడి లేదని, ఎవరూ తనను ప్రలోభపెట్టలేదని సీవీఎల్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. 'మా' ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే, మా భవన నిర్మాణం కోసం రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని, ఆ వ్యక్తి ఎవరన్నది 'మా' నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారం రోజున వెల్లడిస్తానని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ప్రస్తుతం ఇస్తున్న పింఛను రూ.6 వేలకు మరో రూ.4 వేలు కలిపి ఇచ్చేందుకు కొందరు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఆ దాతలు నటులు కాదని అన్నారు. ఇక, మురళీమోహన్ తీసుకువచ్చిన తీర్మానాన్ని తప్పక అమలు చేయాలని సీవీఎల్ కోరారు.