Facebook: ఏడు గంటల తర్వాత వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవల పునరుద్ధరణ

  • రాత్రి 9 గంటల సమయంలో నిలిచిపోయిన సేవలు
  • ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పునరుద్ధరణ
  • క్షమాపణలు వేడుకున్న ఫేస్‌బుక్
Facebook Instagram WhatsApp partially reconnect after 7 hours

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు గంటలపాటు స్తంభించిపోయిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. గత రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల సేవలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఫేస్‌బుక్.. సేవల పునరుద్ధరణకు నడుం బిగించింది. మొత్తానికి ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అకస్మాత్తుగా సేవలు నిలిచిపోవడంపై ఫేస్‌బుక్ క్షమాపణలు తెలిపింది.

తిరిగి ఆన్‌లైన్‌లోకి వస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. తమకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొంది. కాగా, గత రాత్రి సామాజిక మాధ్యమాలన్నీ ఒక్కసారిగా మూగబోవడంతో ఏం జరుగుతోందో అర్థంకాక వినియోగదారులు అయోమయానికి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ట్విట్టర్ ద్వారా ప్రయత్నించారు. కాగా, ఫేస్‌బుక్‌కు భారత్‌లో 41 కోట్ల మంది, వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 21 కోట్ల మందికిపైగా వినియోగదారులున్నారు.

More Telugu News