పండోరా పేపర్స్‌పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు

04-10-2021 Mon 21:08
  • సీబీడీటీ నేతృత్వంలో బహుళ ఏజెన్సీల బృందంతో విచారణ
  • 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీలను పరిశీలించి విడుదల చేసిన ఐసీఐజే
  • దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న సీబీడీటీ
centre to investigate pandora paper case
ప్రపంచంలో 91 దేశాలకు చెందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశాల్లో దాచుకున్న డబ్బు వివరాలతో ‘పండోరా పేపర్స్’ వెలువడ్డాయి. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘పనామా పేపర్స్‌’కు ఇది ఒక విధంగా కొనసాగింపు. ఈ పండోరా పేపర్స్‌లో ఉన్న పేర్లలో 300పైగా పేర్లు భారతీయులవే అనే విషయం మనదేశంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో పండోరా పేపర్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) నేతృత్వంలో ఈ పత్రాల్లోని అంశాలపై దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించింది. బహుళ ఏజెన్సీల బృందాలతో విచారణ జరపనున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని 117 దేశాల్లో 150కిపైగా వార్తాసంస్థల్లో పనిచేసే 600 మందికి పైగా జర్నలిస్టులు ఈ పత్రాలను సిద్ధం చేశారు. దీనికోసం వీరు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను విశ్లేషించగా వచ్చిన డేటానే ఏకంగా 2.94 టెరాబైట్లు ఉన్నట్లు సమాచారం.

ఈ డేటాపై భారత ప్రభుత్వం దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. జాబితాలోని అతికొద్ది మంది పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయని, అసలు ఈ పత్రాలను విడుదల చేసిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) వెబ్‌సైటులో కూడా పూర్తి వివరాలు లేవని సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పత్రాలపై దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ జాబితాలో వందలాది మంది రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, బిలియనీర్లు, సెలెబ్రిటీలు ఉన్నట్లు సమాచారం.