రాజమౌళితోనే ప్రభాస్ 25వ సినిమా?

04-10-2021 Mon 18:35
  • సంక్రాంతికి థియేటర్లకు 'రాధే శ్యామ్'
  • షూటింగు దశలో రెండు భారీ సినిమాలు
  • 25వ సినిమాపై అందరిలో ఆసక్తి
  • తెరపైకి వచ్చిన రాజమౌళి పేరు    
Prabhas in Rajamouli movie

ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' సిద్ధమవుతోంది. జనవరి 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత సినిమాలుగా ఆయన 'సలార్' .. 'ఆది పురుష్' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా షూటింగు దశలో ఉన్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ 25వ సినిమా ప్రత్యేకంగా మారింది. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన ఈ నెల 7వ తేదీన రానున్నట్టుగా చెబుతున్నారు. దాంతో ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఎప్పుడు మొదలవుతుంది? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ సినిమాకి సంబంధించి ముగ్గురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.

ప్రభాస్ 25వ సినిమాకి దర్శకుడిగా రాజమౌళి .. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ .. సందీప్ వంగా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళితోనే ప్రభాస్ చేయనున్నాడనే వార్త మాత్రం బలంగా వినిపిస్తోంది. మహేశ్ మూవీని పూర్తి చేసిన తరువాతనే రాజమౌళి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువెళతాడని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే 2024లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.