యూపీ హింసాకాండ: నవజోత్‌సింగ్ సిద్ధూ, ఇతర కాంగ్రెస్ నేతల అరెస్టు

04-10-2021 Mon 17:32
  • గవర్నర్ నివాసం ఎదుట నిరసన చేసిన పంజాబ్ కాంగ్రెస్
  • కేంద్ర సహాయమంత్రి కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్
  • చన్నీతో మీటింగ్‌ తర్వాత మరోసారి చురుగ్గా రాజకీయాల్లో సిద్ధూ
Sidhu Cong MLAs detained in Chandigarh while protesting against UP violence

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ హింసాకాండ కేసులో తాజాగా మరో రాజకీయ నేత అరెస్టయ్యారు. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజోత్ సింగ్ సిద్ధూతోపాటు అతని సహచర కాంగ్రెస్ నేతలను చండీగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూపీలో నిరసనలు తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయమంత్రి అజయ్‌ కుమార్ మిశ్రా కుమారుడు కారుతో దూసుకెళ్లినట్లు ఆరోపించిన సిద్ధూ అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యూపీ హింసాకాండ తర్వాత లఖీంపూర్‌ వెళ్లడానికి పంజాబ్ సీఎం చరణ్‌జీత్ చన్నీ అనుమతి కోరారు. అయితే ఆయనకేకాదు చాలా మంది ప్రముఖులకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

ఈ క్రమంలో చండీగఢ్‌లో గవర్నర్ భవనం ఎదురుగా సిద్ధూ నిరసన చేశారు. కొన్నిరోజుల క్రితం పంజాబ్ కాంగ్రెస్‌ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. ముఖ్యమంత్రి చన్నీతో సమావేశం తర్వాత మరోసారి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ నివాసం ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే కేంద్ర సహాయమంత్రి అజయ్‌ కుమార్ మిశ్రా కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి సిద్ధూతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేశారు. కాగా, ఇప్పటికే ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్, భూపేంద్ర బాఘేల్ తదితర నేతలు లఖీంపూర్‌ వెళ్లడానికి అనుమతులు కోరారు. వీరెవరికీ అనుమతి ఇవ్వని యూపీ ప్రభుత్వం లక్నో ఎయిర్‌పోర్టులో వీరు దిగకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రియాంకా గాంధీని హౌస్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే