Jeevitha: ఆ ఈసీ మీటింగ్ లో కొట్టుకోవడం ఒకటే తక్కువ: జీవిత

  • జీవిత ప్రెస్ మీట్
  • బండ్ల గణేశ్, పృథ్వీ, నరేశ్ లపై వ్యాఖ్యలు
  • తనను ఎందుకు టార్గెట్ చేశారన్న జీవిత
  • తాను, రాజశేఖర్ ఏంచేశామని నిలదీత
Jeevitha explains on issues

'మా' ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటి జీవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బండ్ల గణేశ్ తన గురించి మాట్లాడాడు కాబట్టే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆయన ఎందుకు తనపై పోటీకి దిగుతున్నాడో చెప్పిన కారణం తనకు నచ్చకే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. అప్పటినుంచి ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని, మధ్యలో పృథ్వీ మాట్లాడడంతో మరోసారి తాను స్పందించాల్సి వచ్చిందని అన్నారు. పృథ్వీ తనపై ఎన్నికల అధికారికి లేఖ రాశాడని, తాను మా ఎన్నికల ప్రచారం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నానని ఆరోపణలు చేశాడని వివరించారు.

తాను మా సభ్యులందరికీ ఫోన్ చేసి టెంపరరీ కార్డులు ఇస్తానని చెప్పినట్టు ఆరోపించడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. అయితే పృథ్వీ భార్య తనకు ఫోన్ చేసి ఏమీ అనుకోవద్దమ్మా, మీరెలాంటివారో నాకు తెలుసు... దయచేసి దీన్ని తీవ్రంగా పరిగణించకండి అని సామరస్య ధోరణిలో మాట్లాడారని జీవిత వెల్లడించారు. నేను, రాజశేఖర్ ఈ ప్రపంచంలో ఎవరూ చేయని పనులు చేశామా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, నరేశ్ పనులు చేయలేదని తాను ఎప్పుడూ చెప్పలేదని జీవిత స్పష్టం చేశారు. నరేశ్ తో తమకు విభేదాలు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. ఫారెన్ ఈవెంట్ పై విభేదాలు వచ్చినవారితోనే నరేశ్ మళ్లీ ప్రోగ్రామ్ చేయాలనుకున్నారని వివరించారు. ఒక్కసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టాలని ఎంత కోరినా నరేశ్ వినలేదని ఆరోపించారు. ఈసీ మీటింగ్ లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువని, మా డైరీ ఆవిష్కరణ విషయంలోనూ నరేశ్ తో విభేదాలు ఉన్నాయని జీవిత వెల్లడించారు.

ఇళ్ల పనులు ఆగింది తన వల్ల కాదని, నరేశ్ వల్లేనని ఆమె స్పష్టం చేశారు. ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే సంతకాలు పెట్టరని తెలిపారు. మంచి చేయాలని ప్రయత్నించి తాను, రాజశేఖర్ పిచ్చోళ్లం అయ్యామని పేర్కొన్నారు. ఏం తప్పు చేశామని తనను టార్గెట్ చేశారో నరేశ్, పృథ్వీ, బండ్ల గణేశ్ చెప్పాలని నిలదీశారు. కొంతమందికి డబ్బులిచ్చి మాలో ఎందుకు గ్రూపులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రయత్నమే జరగలేదని జీవిత విమర్శించారు.

More Telugu News