వికెట్ల కోసం ట్రై చేయొద్దని కోహ్లీ చెప్పాడు: చాహల్

04-10-2021 Mon 16:46
  • పంజాబ్‌పై మూడు వికెట్లు కూల్చి సత్తా చాటిన స్పిన్నర్
  • మధ్య ఓవర్లలో డాట్‌ బాల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కెప్టెన్ సలహా
  • నా బలానికి అనుగుణంగా బౌలింగ్‌ చేశానంటున్న చాహల్
Kohli told me to bowl dot balls Chahal


వికెట్ల కోసం ప్రయత్నించకుండా ఎక్కువ డాట్‌ బాల్స్ వేయడానికి ట్రై చేయాలని కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తనకు చెప్పినట్లు స్పిన్నర్ యుజ్వేంద్రచాహల్ వెల్లడించాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్పిన్నర్ మంచి ప్రదర్శన చేశాడు. 29 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.

ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి చాహల్ మాట్లాడాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ బాదడంతో మంచి స్కోరు సాధించింది. ఛేజింగ్‌లో ఒకానొక దశలో 91/1గా పంజాబ్‌ నిలిచింది. ఈ దశలో బంతి తీసుకున్న చాహల్ అద్భుతం చేశాడు. నికోలస్‌ పూరన్‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం 16వ ఓవర్లో మరో రెండు వికెట్లు కూల్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే తనను వికెట్ల కోసం ప్రయత్నించకుండా డాట్‌ బాల్స్ వేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని కెప్టెన్ కోహ్లీ చెప్పినట్లు చాహల్ వెల్లడించాడు. తాను తన బలానికి కట్టుబడి బంతులు వేశానని, దీంతో వికెట్లు పడ్డాయని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో బెంగళూరు జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ చేరింది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ జట్లు ప్లేఆఫ్స్ చేరాయి. మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి.