Dronavalli Harika: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారికకు సీఎం జగన్ అభినందనలు

  • స్పెయిన్ లో ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్
  • ఫైనల్లో రష్యా చేతిలో ఓడిన భారత అమ్మాయిలు
  • అనేక జట్లను ఓడించి ఫైనల్ వరకు వెళ్లిన భారత్
  • భారత్ కు రజతం
  • అద్భుత ప్రదర్శన కనబర్చిన హారిక
CM Jagan appreciates Chess icon Dronavalli Harika

స్పెయిన్ లో జరిగిన ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్ లో భారత అమ్మాయిల జట్టు రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడిన భారత్ ఆఖరి మెట్టుపై ఓడింది. బలమైన రష్యా జట్టుకు ద్రోణవల్లి హారిక నేతృత్వంలోని భారత జట్టు గట్టి పోటీ ఇచ్చింది. ఈ టైటిల్ సమరంలో భారత్ 0-2తో ఓటమిపాలైంది. అయితే అనేక బలమైన జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ రజతం సాధించడం గొప్ప ఘనతగానే భావించాలి.

ఈ నేపథ్యంలో, కెప్టెన్ ద్రోణవల్లి హారికను ఏపీ సీఎం జగన్ అభినందించారు. ఈ టీమ్ ఈవెంట్ లో హారిక ప్రదర్శన అమోఘం అని కొనియాడారు. భవిష్యత్తులో హారిక మరిన్ని ఘనతలు సాధించాలని, భారత జట్టు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన ఇతర క్రీడాకారిణులు ఓటమిపాలైనా, హారిక మాత్రం విజయం సాధించింది. ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి గోర్యాక్ చినాతో తొలి గేమ్ ను నెగ్గిన హారిక, రెండో గేమ్ ను డ్రా చేసుకుంది.

భారత జట్టులో తానియా, భక్తి కులకర్ణి, మేరీ ఆన్ గోమ్స్, వైశాలి ఇతర సభ్యులు. 2007 నుంచి ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్ నిర్వహిస్తుండగా, భారత్ కు ఓ పతకం లభించడం ఇదే తొలిసారి.

More Telugu News