AP High Court: 'ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం' పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

High Court stays govt decision on aided institutions submerge
  • ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జీవోలు
  • హైకోర్టును ఆశ్రయించిన విద్యాసంస్థలు
  • స్టే ఇచ్చిన హైకోర్టు
  • విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకురావొద్దని ఉత్తర్వులు
  • తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలు తీసుకురావడం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. విలీనంపై ఈ నెల 28 వరకు ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు స్టే విధించింది.

సమ్మతి తెలపలేదన్న కారణంతో విద్యాసంస్థలకు నిధుల మంజూరు నిలిపివేయవద్దని పేర్కొంది. ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకు ఈ నెల 22 వరకు గడువు విధించింది. కాగా, దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఎయిడెడ్ విద్యాసంస్థలు ఇష్టపూర్వకంగా సమ్మతి తెలిపితేనే ప్రభుత్వం తదుపరి ప్రక్రియ కొనసాగిస్తోందని, విద్యాసంస్థలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడంలేదని స్పష్టం చేశారు.
AP High Court
Stay
Aided Institutions
Submerge
Govt
Andhra Pradesh

More Telugu News