జపాన్ 100వ ప్రధాన మంత్రిగా ఫుమియో కిషిడా

04-10-2021 Mon 14:40
  • పార్లమెంటు ఉభయసభల్లోనూ భారీ మెజార్టీతో గెలుపు
  • ఏడాది పాటు ప్రధానిగా ఉన్న తర్వాత  యోషిహిడే సుగా రాజీనామా
  • తన బదులు మరొకర్ని ఎన్నుకోవాలని పార్టీకి సూచన
Fumio Kishida becomes Japans 100th Prime Minister

జపాన్ దేశ నూతన ప్రధానిగా ఫుమియో కిషిడా ఎన్నికయ్యారు. పార్లమెంటు ఉభయసభల్లో భారీ మెజార్టీ సాధించిన ఆయన ఎన్నిక అధికారికం అయింది. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి చెందిన 64 ఏళ్ల ఈ నేత జపాన్ దేశ 100వ ప్రధాని. ఆయన కన్నా ముందు ప్రధానిగా ఉన్న యోషిహిడే సుగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు ప్రధానిగా సేవలందించిన సుగా పాలనపై ప్రజల్లో అసంతృప్తి చెలరేగింది.

అంతకుముందు ప్రధానిగా ఉన్న షింజో అబే అనారోగ్యంతో పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో దేశ ప్రధానిగా సుగా బాధ్యతలు అందుకున్నారు. కానీ, కరోనా విజృంభణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడం వంటి కారణాలతో ఆయనపై ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. ఇదే సమయంలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించడం మరింత మందికి ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నానని, మరోసారి పోటీలో నిలబడే యోచన లేదని సుగా ప్రకటించారు.

కొత్త వారిని ప్రధానిగా ఎన్నుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే గతంలో జపాన్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన ఫుమియో కిషిడాకు పార్టీలో భారీ మద్దతు లభించింది. సోమవారం నాడు జపాన్ పార్లమెంటు ఉభయసభల్లో కూడా భారీ మెజార్టీ సాధించిన కిషిడా త్వరలోనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.