Badvel: అధిష్ఠానం ఆదేశిస్తే బద్వేలు బరిలోకి: సోము వీర్రాజు

we are in badvel by poll Race said somu veerraju
  • ఆశావహుల జాబితాను అధిష్ఠానానికి పంపామన్న వీర్రాజు
  • పోటీ చేస్తే జనసేన మద్దతు కోరుతామని స్పష్టీకరణ
  • పోటీ నుంచి తప్పుకున్న జనసేన, టీడీపీ
ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన కడప జిల్లా బద్వేలులో తాము బరిలోకి దిగుతున్నట్టు బీజేపీ ప్రకటించింది. బద్వేలు నుంచి పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అధిష్ఠానం నుంచి వచ్చే అదేశానుసారం ముందుకెళ్తామని పేర్కొన్నారు. కడపలో ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం అనంతరం మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు.

బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించామని, అయితే పవన్ అందుకు సుముఖత చూపలేదని అన్నారు. దీంతో తమ పార్టీ నుంచే అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు చెప్పారు. పార్టీలోని ఆశావహుల పేర్లతో అధిష్ఠానానికి జాబితా పంపించినట్టు చెప్పారు. తాము కనుక పోటీలో నిలిస్తే జనసేన మద్దతు కోరతామని వీర్రాజు అన్నారు.

మరోవైపు, బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అంతకుముందు ఇక్కడి నుంచి ఓబుళాపురం రాజశేఖర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించింది. అయితే, దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో సంప్రదాయం ప్రకారం బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. జనసేన కూడా బరిలోకి దిగబోమని ప్రకటించింది. బీజేపీ కూడా పోటీ చేయకుంటే బద్వేలు ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేదంటే మాత్రం ఎన్నిక తప్పనిసరి అవుతుంది.
Badvel
Kadapa
Janasena
TDP
BJP
By Poll

More Telugu News