మాదాపూర్‌లో సిగ్నల్ వద్ద ఆగివున్న బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువతి మృతి

04-10-2021 Mon 06:52
  • సీఐఐ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆగిన బైక్
  • వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టిన కారు
  • తలకు బలమైన గాయం కావడంతో యువతి అక్కడికక్కడే మృతి
  • పరారైన కారు డ్రైవర్
Road Accident in Madhapur young girl dies

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి సిగ్నల్ వద్ద ఆగివున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వున్న యువతి మృతి చెందగా, యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. అజయ్, జెన్నిఫర్ బైక్‌పై కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సీఐఐ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో వీరు ఆగారు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో బైక్‌పై కూర్చున్న జెన్నిఫర్ ఎగిరి పడింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.