Mohan Babu: జగన్ ను కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు: మోహన్ బాబు

  • ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి వచ్చిన మోహన్ బాబు
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు
  • గతంలో చంద్రబాబు కోసం పాటుపడ్డానని వెల్లడి
  • ఈసారి జగన్ కోసం ప్రచారం చేశానని వివరణ
Mohan Babu comments on CM Jagan

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బంధువులేనని వెల్లడించారు. గతంలో చంద్రబాబుకు కూడా ప్రచారం చేశానని, జగన్ కు కూడా ఓసారి ప్రచారం చేద్దామన్న ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో పార్టీ తరఫున పనిచేశానని వివరించారు. అంతకుతప్పించి తాను మరే ప్రయోజనం ఆశించి జగన్ కు ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు.

సీఎం జగన్ ను కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఘంటాపథంగా చెప్పగలనని మోహన్ బాబు అన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కొందరు చంద్రబాబు హయాం నుంచి పనిచేస్తున్నవారు ఉన్నారని తెలిపారు. కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థల విధానం దెబ్బతిన్నదని ఆరోపించారు. తన విద్యాసంస్థలకు న్యాయంగా నిర్ణయించాల్సిన ఫీజులు నిర్ణయించలేదన్నది వాస్తవం అని మోహన్ బాబు ఉద్ఘాటించారు. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నానని స్పష్టం చేశారు.

గతంలో చంద్రబాబు హయాంలో బకాయిల కోసం రోడ్డెక్కిన మీరు ఇప్పుడు అదే అంశంపై మాట్లాడేందుకు భయపడుతున్నారా అని ఆర్కే ప్రశ్నించగా, నాకా... భయమా! అంటూ తనదైన శైలిలో స్పందించారు. జగన్ అంటే తనకు భయంలేదని, జగన్ అంటే ప్రేమాభిమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే జగన్ కాలేజీల విషయంలో ఓ తప్పు నిర్ణయం తీసుకున్నాడని, ఆ విషయం కూడా చెప్పామని వెల్లడించారు. జగన్ కు తప్పు సలహాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారుల పేర్లు బయటపెట్టదలచుకోలేదని అన్నారు.

More Telugu News