"పరుగు పందెం పెట్టుకుందామా... ఎవరి పనైపోయిందో తెలుస్తుంది!": మధ్యప్రదేశ్ సీఎంకు కమల్‌నాథ్ సవాల్

03-10-2021 Sun 20:11
  • కమల్‌ ఆరోగ్యంపై సీఎం శివరాజ్ సింగ్ వ్యాఖ్యలు
  • కమల్ నాథ్ పనైపోయిందంటూ విమర్శలు
  • లాంగ్ కొవిడ్ కారణంగానే ఢిల్లీకి వెళ్లానన్న కమల్‌నాథ్
  • అదిరిపోయే జవాబన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి
Kamal Nath challenged for race to MP CM

కొన్ని రోజులుగా తన పనైపోయిందంటూ విమర్శలు చేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌ నాథ్ ఛాలెంజ్ విసిరారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, మాట్లాడితే ఢిల్లీ వెళ్లి చికిత్స చేయించుకుంటున్నానని శివరాజ్ కొన్ని సందర్భాల్లో అన్న మాటలను కమల్‌నాథ్ గుర్తుచేశారు. తనకు లాంగ్‌ కొవిడ్ వచ్చిందని, దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత న్యూమోనియా సమస్య తలెత్తిందని కమల్ నాథ్ చెప్పారు.

‘‘ఇది చాలామందిలో సహజం. ఆ చికిత్స కోసమే ఢిల్లీ వెళ్లా. అదీ ఇప్పట్లో కాదు. నా ఆరోగ్యంపై అంతగా అనుమానాలుంటే పరుగు పందెం పెట్టుకుందాం రా’’ అంటూ 62 ఏళ్ల శివరాజ్‌కు ఆయన సవాల్ విసిరారు. కమల్‌నాథ్ వయసు 74 ఏళ్లు.

కమల్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా స్పందించారు. సీఎంకు దిమ్మతిరిగే బదులిచ్చారని కమల్‌నాథ్‌ను కొనియాడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తను ఓడిపోయిన విషయం శివరాజ్‌సింగ్‌ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అయితే ఆ తర్వాత కమల్‌నాథ్ సర్కారు కూలిపోవడంతో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం, దానిలో బీజేపీ గెలుపొందడం తెలిసిందే.