నిరసన తెలుపుతున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన కేంద్రమంత్రి కుమారుడు... ఇద్దరి మృతి

03-10-2021 Sun 19:30
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • టికూనియా గ్రామంలో కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా యూపీ డిప్యూటీ సీఎం
  • నల్ల జెండాలు చూపేందుకు ప్రయత్నించిన రైతులు
Union minister son allegedly caused to death of two farmers in Uttarpradesh

ఉత్తరప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. నిరసనలు తెలుపుతున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారుతో దూసుకెళ్లగా, ఈ ఘటనలో ఇద్దరు రైతులు మృతి చెందారు. యూపీలోని టికూనియా గ్రామంలో రైతులు నేడు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.

టికూనియా గ్రామంలో ఓ కార్యక్రమం జరుగుతుండగా, ఆ కార్యక్రమానికి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. దాంతో ఆయనకు నల్ల జెండాలు చూపించాలని రైతులు నిర్ణయించుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

టికూనియా గ్రామం కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తండ్రి స్వస్థలం. తమ గ్రామానికి వస్తున్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు స్వాగతం పలికేందుకు అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారులో వెళుతుండగా, నిరసనకారులు ఆయన కారును అడ్డుకున్నారు. అయితే, ఆశిష్ మిశ్రా తన కారును ఆపకుండా వేగంగా రైతులకు పైకి దూసుకుపోయినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని తెలిపారు.

ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అక్కడున్న మూడు కార్లను  దహనం చేశారు. వాటిలో ఒకటి కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాదని తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం రైతులు పెద్దసంఖ్యలో టికూనియా గ్రామానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ టికూనియా వెళ్లి పరిస్థితిని సమీక్షించాలంటూ అసిస్టెంట్ డీజీపీని ఆదేశించారు.