హైదరాబాద్‌తో మ్యాచ్‌ అతన్ని పరీక్షిస్తుంది: మోర్గాన్‌పై గవాస్కర్ కామెంట్స్

03-10-2021 Sun 19:10
  • చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో అనూహ్య పరాజయం
  • ఈ టోర్నీలో బ్యాటుతో రాణించలేక అవస్థలు పడుతున్న మోర్గాన్
  • ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్
Morgan captaincy will be tested vs SRH Gavaskar

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సారధి ఇయాన్ మోర్గాన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉందని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఒక ప్రముఖ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాదిలో టీ20 ఫార్మాట్‌లో మోర్గాన్ పెద్దగా రాణించని విషయాన్ని గవాస్కర్ ఎత్తిచూపాడు. ఇప్పటి వరకూ కేకేఆర్‌ తరఫున అతను సరైన ఇన్నింగ్స్ ఒకటి కూడా ఆడలేదు. మొత్తం 12 మ్యాచుల్లో కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు. చివరగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో కోల్‌కతా జట్టు అనూహ్య ఓటమి చవిచూసింది.

చివరి ఓవర్లో ఓడిపోయింది. ఈ ఓటమితో మోర్గాన్‌పై ఒత్తిడి పెరుగుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దీనికితోడు అతను ఫామ్‌లో లేకపోవడం కూడా అతని ఒత్తిడిని మరింత పెంచుతుందన్నాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ మోర్గాన్‌ సామర్థ్యానికి పరీక్ష అని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, పంజాబ్‌తో ఓటమి తర్వాత కేకేఆర్ హెడ్‌ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా మోర్గాన్ బ్యాటుతో రాణించాల్సిన అవసరం ఉందన్న సంగతి తెలిసిందే. మరి ఇంత ఒత్తిడిలో మోర్గాన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి మరి.