బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరం... పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం

03-10-2021 Sun 18:57
  • సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి
  • ఆయన భార్యకే టికెట్ ఇచ్చిన వైసీపీ
  • అభ్యర్థిని నిలపడంలేదని ప్రకటించిన జనసేన
  • ఏకగ్రీవం చేసుకోవాలని సూచన
  • జనసేన బాటలోనే టీడీపీ
  • పొలిట్ బ్యూరోలో చర్చించిన చంద్రబాబు
TDP keeps distance to Budvel by election

బద్వేల్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్టీ పొలిట్ బ్యూరో భేటీ అయింది. బద్వేల్ లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకే వైసీపీ టికెట్ ఇచ్చినందున, బరిలో దిగేందుకు టీడీపీ విముఖత వ్యక్తం చేసింది. తద్వారా ఏకగ్రీవానికి మార్గం సుగమం చేసింది.

ఇప్పటికే జనసేన పార్టీ బద్వేల్ లో తమ అభ్యర్థిని బరిలో దింపడంలేదని ప్రకటించడం తెలిసిందే. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్ లో పోటీ చేయడంలేదని టీడీపీ నాయకత్వం వెల్లడించింది.

బద్వేల్ లో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కొన్నాళ్ల కిందట మరణించారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 30న పోలింగ్ ఉంటుందని ప్రకటించింది.

ఈ క్రమంలో టీడీపీ తొలుత తన అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. రాజశేఖర్ గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ భావించింది. అయితే, గత ఆనవాయితీలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ తాజాగా బరి నుంచి తప్పుకుంది.