ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో 'మా' సభ్యులతో ప్రకాశ్ రాజ్ విందు సమావేశం

03-10-2021 Sun 16:16
  • అక్టోబరు 10న 'మా' ఎన్నికలు
  • ఊపందుకున్న ప్రచారం
  • సీనియర్ నటులను కలుస్తున్న మంచు విష్ణు
  • వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రకాశ్
Prakash Raj held meeting with MAA members at Film Nagar Cultural Club
మరో వారం రోజుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనుండగా, ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు తమ ప్రచారం తీవ్రతరం చేశారు. మంచు విష్ణు సీనియర్ నటులను కలుస్తూ మద్దతు కోరుతుండగా, ప్రకాశ్ రాజ్ కీలక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

తాజాగా, ప్రకాశ్ రాజ్ నటీనటులతో 'మా' ఎన్నికలపై ప్రత్యేక భేటీ నిర్వహించారు. హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వేదికగా ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన 'మా' సభ్యులకు ప్రకాశ్ రాజ్ తన మేనిఫెస్టోను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. వారి నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అక్టోబరు 10న 'మా' ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎవరికివారే తమ విజయంపై ధీమాతో ఉన్నారు. 'మా' ఎన్నికల బరి నుంచి నటుడు సీవీఎల్ నరసింహారావు తన ప్యానెల్ ను ఉపసంహరించడంతో బరిలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.