భరణం విషయంలో సమంత సంచలన నిర్ణయం... వివరాలు ఇవిగో!

03-10-2021 Sun 14:56
  • అక్టోబరు 6న చై, సామ్ పెళ్లిరోజు
  • నాలుగు రోజుల ముందుగానే విడాకుల ప్రకటన
  • సమంతకు రూ.200 కోట్ల భరణం!
  • ఒక్క పైసా కూడా అక్కర్లేదన్న సమంత!
  • సన్నిహితవర్గాల కథనం!
Samantha said no to alimony from Naga Chaitanya as per reports

తమ పెళ్లిరోజు మరో నాలుగు రోజుల్లో ఉండగా, తమ వైవాహిక బంధం ముగిసినట్టు నిన్న నాగచైతన్య, సమంత చేసిన సంయుక్త ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2017 అక్టోబరు 6న చై, సామ్ జోడీ ఒక్కటైంది. గోవాలో వీరి పెళ్లి అత్యంత ఘనంగా, అటు క్రిస్టియన్ పద్ధతిలో, ఇటు హిందూ విధానాల ప్రకారం జరిగింది. కానీ, కొంతకాలంగా ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు పరాకాష్ఠకు చేరాయి. దాంతో వీరిద్దరూ విడిపోతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే, విడాకుల నేపథ్యంలో నాగచైతన్య, ఆయన కుటుంబం సమంతకు రూ.200 కోట్ల మేర భరణం చెల్లించేందుకు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇంత భారీ మొత్తంలో భరణం ఓ సంచలనం అనుకుంటే, సమంత నిర్ణయం అంతకంటే సంచలనం అని చెప్పాలి. నాగచైతన్య నుంచి తాను ఒక్క పైసా కూడా భరణంగా తీసుకోనని ఆమె స్పష్టం చేసినట్టు వెల్లడైంది. సమంత సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి.

తాను బతకడానికి సినిమాలు ఉన్నాయని, విడిపోయిన తర్వాత కూడా భర్త మీద ఆధారపడాల్సిన స్థితిలో లేనని... పెళ్లి, విడాకుల ద్వారా వచ్చే డబ్బును తాను కోరుకోవడంలేదని సమంత స్పష్టం చేసినట్టు సమాచారం. ఏదేమైనా ఈ విడాకుల నిర్ణయంతో సమంత గుండె పగిలినంత పనైందని, ఆమె మునుపటిలా ఉత్సాహంతో సినిమాలు చేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారం అని సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.