లైగర్ తో యువీ పోటాపోటీ.. దాని ముందు ముగ్గురి బలమూ దిగదుడుపే.. ఫొటోలివిగో!

03-10-2021 Sun 14:32
  • దుబాయ్ ఫేమ్ పార్కులో యువరాజ్ సింగ్ పర్యటన
  • లైగర్ తో టగ్ ఆఫ్ వార్
  • పార్కులో జంతువులకు ఫీడింగ్
  • ఆడసింహానికి నేరుగా మాంసం తినిపించిన క్రికెటర్
Yuvi Tug Of War With Liger At Dubai Fame Park

మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ మెరుపులతో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన యువరాజ్ సింగ్.. ఇప్పుడు తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల దుబాయ్ లోని ఫేమ్ పార్కుకు వెళ్లిన అతడు.. లైగర్ (పెద్దపులి, సింహం క్రాస్ బ్రీడ్)తో టగ్ ఆఫ్ వార్ ఆడాడు. ఓ వైపు లైగర్, మరో వైపు యువీ, అతడి ఇద్దరు స్నేహితులు కలిసి తాడును లాగే ఆట ఆడారు. కానీ, లైగర్ ముందు వారి బలం అసలు ఏ మాత్రమూ సరిపోలేదు.


అంతేకాదు.. పార్క్ అంతా కలియతిరుగుతూ అడవి జంతువులకు ఆహారం పెడుతూ సరదాగా గడిపాడు యువీ. ఓ ఆడ సింహానికి నేరుగా మాంసం తినిపిస్తూ కనిపించాడు. ఆ టూర్ కు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘‘టైగర్ వర్సెస్ లైగర్.. చివరకు ఎవరు గెలిచారో అందరికీ తెలుసు కదా. భయాలన్నీ పక్కనపెట్టి ప్రకృతి, అడవి అందాలతో ఓ మధురానుభూతిని సంపాదించుకున్నాను’’ అని రాసుకొచ్చాడు. ఓ సురక్షితమైన వాతావరణంలో అన్ని జంతువులనూ ఫేమ్ పార్కులో సంరక్షిస్తారన్నాడు. జంతువుల బాగోగులను చూసేందుకు సుశిక్షితులైన సిబ్బంది ఉంటారని చెప్పుకొచ్చాడు.