Corona Virus: కరోనా నుంచి కోలుకున్నా వదలని ఇబ్బందులు.. చిన్నపేగుల్లో గడ్డకడుతున్న రక్తం!

  • కరోనా బాధితులను వేధిస్తున్న ఇతర సమస్యలు
  • తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ నిమ్స్‌లో చేరిన ఆరుగురు
  • చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టి గ్యాంగ్రేన్‌గా మారిన వైనం
  • ఇద్దరి పరిస్థితి విషమం
gangrene infects after recovery from covid

కరోనా బారిన పడి కోలుకున్న అనంతరం రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరో ఆందోళనకర విషయం బయటపడింది. కరోనా మహమ్మారి చిన్నపేగుల్లోనూ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్టు తేలింది. తీవ్ర కడుపు నొప్పితో ఇటీవల ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. వీరిని పరీక్షించగా వారి చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టి గ్యాంగ్రేన్ (కుళ్లిన స్థితి)గా మారినట్టు గుర్తించారు. ఇద్దరు బాధితుల్లో దీని వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండడంతో పేగులను తొలగించగా, ఇద్దరిలో కిడ్నీలు పాడయ్యాయి.  ప్రస్తుతం వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.బాధితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

కాగా, బాధితులు ఆరుగురికి కరోనా సోకినట్టు తెలియకపోవడం గమనార్హం. వీరు కరోనా తొలి డోసు తీసుకున్నారని, వారిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కరోనా సోకిన తర్వాత కొందరిలో రక్తం గడ్డకట్టే ప్రమాదముంది. తాజాగా, ఆసుపత్రిలో చేరిన వీరిలోనూ కొన్ని రోజుల క్రితమే రక్తం గడ్డకట్టినట్టు తెలిపారు. పేగులకు రక్తప్రసరణ సరిగా జరగక పోవడంతో అక్కడ కణజాలం చనిపోయి గ్యాంగ్రేన్‌గా మారిందని వైద్యులు తెలిపారు.

More Telugu News