తల్లిని దుర్భాషలాడి క్షమాపణ చెప్పలేదని సీనియర్‌ను చంపేసిన విద్యార్థి

02-10-2021 Sat 23:13
  • దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
  • ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న నిందితుడు
  • హత్యానేరం కింద అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలింపు
Delhi school boy stabs Class 12 student to death for abusing his mother

తన తల్లిని దుర్భాషలాడి, సారీ చెప్పమంటే చెప్పలేదనే కోపంతో స్కూల్లో తన సీనియర్‌ను పొడిచి చంపేశాడో విద్యార్థి. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీనిలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల కుర్రాడు మరణించాడు.

ఇదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న మరో కుర్రాడితో 12వ తరగతి విద్యార్ధికి గొడవ జరిగింది. జూనియర్ విద్యార్థి తల్లిని సీనియర్ సంవత్సరం చదువుతున్న విద్యార్థి దుర్భాషలాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న కుర్రాడు క్షమాపణ చెప్పాలంటూ సీనియర్‌తో వాగ్వాదానికి దిగాడు. శుక్రవారం నాడు స్కూలు బయట ఉండగా వీరిద్దరికీ గొడవ జరిగింది. ఈ క్రమంలో నిందితుడు కత్తితో దాడి చేయడంతో 12వ తరగతి చదువుతున్న సీనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సదరు యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 11వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. హత్యానేరం కేసు నమోదు చేసి నిందితుడిని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు.