ఆ రెండు ఓవర్లే మ్యాచ్‌ను మలుపు తిప్పాయి: పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్‌ కోచ్

02-10-2021 Sat 21:50
  • కోల్‌కతాపై విజయంపై పంజాబ్ కోచ్‌ అర్షదీప్ సింగ్
  • మహమ్మద్ షమీ ఓవర్లే కీలకమన్న డేమియన్ రైట్
  • కేఎల్‌ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కితాబు
Shami and Arshdeeps last 2 overs were the difference vs KKR Wright

కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అనూహ్య విజయం సాధించడంలో చివరి రెండు ఓవర్లు కీలక పాత్ర పోషించాయని పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్‌ కోచ్ డేమియన్ రైట్ అన్నాడు. ఈ ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశారని మెచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్‌ సందర్భంగా రైట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

పంజాబ్ సారధి కేఎల్‌ రాహుల్ 67 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఎటువంటి ఒత్తిడీ లేకుండా తన ఆట ఆడాడని మెచ్చుకున్నాడు. మయాంక్ అగర్వాల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. అదే సమయంలో చివర్లో మెరుపులు మెరిపించిన యువ ప్లేయర్ షారుఖ్‌ఖాన్ తన సత్తా చూపించాడని, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని అన్నాడు. కోల్‌కతాతో పోరులో తమ బలమైన జట్టును బరిలో దింపామని రైట్ వెల్లడించాడు.

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో రాహుల్, మయాంక్ అగర్వాల్, షారుఖ్‌ఖాన్ రాణించడంతో మరో మూడు బంతులు మిగిలుండగానే పంజాబ్ జట్టు విజయం సాధించింది.