తల్లి మరణించిందని తెలియక.. మృతదేహంతోనే ఇంట్లో ఉంటున్న చిన్నారులు

02-10-2021 Sat 20:56
  • ఇంట్లోకి వచ్చిన పోలీసులతో తల్లి నిద్రపోతోందని చెప్పిన వైనం
  • ఫ్రాన్స్‌లో వెలుగు చూసిన హృదయవిదారక ఘటన
  • తల్లిది సహజ మరణమన్న పోలీసులు
Sisters spend days with dead body of mother
కొన్ని రోజులుగా ఇద్దరు చిన్నారులు స్కూల్‌కు వెళ్లడం లేదు. దీంతో అనుమానం వచ్చిన స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన పోలీసులు ఆ చిన్నారుల ఇంటికి వెళ్లారు. తలుపు కొట్టగానే తెరిచిన ఇద్దరు చిన్నారులు ’చప్పుడు చేయకండి, అమ్మ నిద్రపోతోంది‘ అని అన్నారు. వారిలో ఒకరి వయసు ఏడేళ్లు కాగా, మరొకరి వయసు ఐదేళ్లే. లోపలకు వెళ్లిన పోలీసులకు హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఈ ఇద్దరు పిల్లల తల్లి మరణించి ఉంది. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని లే మాన్స్‌ పట్టణంలో వెలుగు చూసింది.

తల్లి మరణించిందని తెలియని అక్కాచెల్లెళ్లు కొన్ని రోజులుగా తల్లి మృతదేహంతో కలిసి ఉంటున్నారు. వెంటనే తల్లి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఇద్దరు చిన్నారులను చిల్డ్రన్స్ కేర్‌కు తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరణించిన యువతిది సహజ మరణం అని పోలీసులు తెలిపారు. ఎటువంటి నేరమూ జరగలేదని స్పష్టం చేశారు. ఇద్దరు పిల్లలు కొంచెం తేరుకున్నాక వారి స్టేట్‌మెంట్లు కూడా తీసుకుంటామని చెప్పారు.