Rawoof: దిశ ఎన్ కౌంటర్ కేసులో ఆసక్తికర అంశం వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి

  • సంచలనం సృష్టించిన దిశ ఘటన
  • నిందితుల ఎన్ కౌంటర్
  • విచారణ జరుపుతున్న జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్
  • కీలక సాక్షుల విచారణ
Witness reveals what happened at Disha culprits encounter location

తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ ఘటనకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన అబ్దుల్ రవూఫ్ అనే వ్యక్తిని కమిషన్ విచారించింది. దిశ వస్తువులను దాచిన ప్రాంతానికి పోలీసులు నిందితులను తీసుకెళ్లగా, తాను కూడా పోలీసుల వెంట చటాన్ పల్లి వెళ్లానని రవూఫ్ వెల్లడించాడు.

వస్తువుల కోసం వెదుకుతున్నట్టు నటించిన ఆరిఫ్ అనే నిందితుడు ఒక్కసారిగా చేతుల్లోకి మట్టి తీసుకుని పోలీసులపై చల్లాడని, దాంతో అక్కడున్న వారి కళ్లలో మట్టి పడిందని వివరించాడు. ఈ క్రమంలో దిశ నిందితులు రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారని తెలిపాడు. అంతేకాకుండా, నిందితులు చెన్నకేశవులు, ఆరిఫ్ పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని రవూఫ్ పేర్కొన్నాడు.

పోలీసులు చాలామంది ఉన్నారు కదా... ఆ సమయంలో వారు నిందితులను అడ్డుకోలేదా? అని కమిషన్ తరఫు న్యాయవాదులు పరమేశ్వర్, విరూపాక్ష గౌడ ప్రత్యక్షసాక్షి రవూఫ్ ను ప్రశ్నించారు. కళ్లలో మట్టి పడడంతో ఆ విషయం తాను చూడలేదని రవూఫ్ వెల్లడించాడు. నిందితుల వాంగ్మూలంలో లేని సంగతులు మీ స్టేట్ మెంట్ లో ఉన్నాయంటూ కమిషన్ రవూఫ్ ను ప్రశ్నించింది. అందుకు అతడు బదులిస్తూ, ఆ వాంగ్మూలం ఎలా నమోదు చేసుకున్నారో తనకు తెలియదని బదులిచ్చాడు.

కాగా, ఈ ఘటనలో కీలక సాక్షి అయిన పోలీస్ వాహనం డ్రైవర్ యాదగిరిని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నిన్న విచారించింది. ఎన్ కౌంటర్ సమయంలో బుల్లెట్ల శబ్దం వినిపించిందా అని యాదగిరిని ప్రశ్నించగా, తాను వాహనంలో పడుకుని ఉన్నానని, తనకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదని వెల్లడించాడు.

More Telugu News