పవన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ అనవసరంగా పెద్దవాడిని చేస్తున్నారు: ధర్మాన కృష్ణదాస్

02-10-2021 Sat 17:48
  • పవన్ కు రాజకీయ చతురత లేదు
  • రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు
  • సినీ పరిశ్రమ వ్యక్తులే ఆయనను వ్యతిరేకిస్తున్నారు
We are making Pawan as big man by talking too much about him says Dharmana

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శలు గుప్పించారు. పవన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఆయనను అనవసరంగా పెద్దవాడిని చేస్తున్నారని అన్నారు. ఆయనకు రాజకీయ చతురత కానీ, అనుభవం కానీ ఏముందని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసి, ఆ రెండు స్థానాల్లో ఓడిపోయారని... అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడాలని ఎద్దేవా చేశారు. నిలకడ లేని వ్యక్తి పవన్ అని అన్నారు.

తిరుపతి లోక్ సభ ఎన్నికలో బీజేపీతో కలిసి ప్రయాణిస్తూనే టీడీపీకి ఓట్లు వేయించారని విమర్శించారు. నామమాత్రంగా ఓటు వేయించే శక్తి మాత్రమే పవన్ కు ఉందని అన్నారు. రాజకీయ పార్టీని పెట్టి తనకున్న అభిమానులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడని దుయ్యబట్టారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులే పవన్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని అన్నారు.