ఇలాంటి సమయంలో బల ప్రదర్శన వల్ల ఇబ్బందిపడేది ప్రజలే: పవన్ కు సజ్జల హితవు

02-10-2021 Sat 14:31
  • ఏపీలో పవన్ శ్రమదానం
  • రోడ్ల మరమ్మతులకు స్వయంగా విచ్చేసిన పవన్
  • కరోనా నిబంధనలు అందరికీ సమానమేనన్న సజ్జల
  • టీడీపీ హయాంలో ఎందుకు శ్రమదానం చేయలేదంటూ ఆగ్రహం
Sajjala comments on Pawan Kalyan tour

రోడ్లపై శ్రమదానం చేసేందుకు జనసేనాని ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కరోనా నిబంధనలు అందరికీ సమానమేనని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కరోనా నిబంధనలు విధిస్తే, ఇలాంటి వేళ బల ప్రదర్శన వల్ల ఇబ్బంది కలిగేది ప్రజలకేనని అన్నారు.

అయినా రోడ్లపై గుంతలు పూడ్చి శ్రమదానం చేయడానికి పవన్ ఎందుకు? రోడ్ల మరమ్మతులకు సీఎం జగన్ రూ.2,200 కోట్లు కేటాయించారు అని సజ్జల వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున పనులు జరగడంలేదని, వర్షాలు తగ్గగానే పనులు చేపడతామని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో రోడ్లు వేయలేదని, పవన్ అప్పుడెందుకు ప్రశ్నించలేదని సజ్జల నిలదీశారు. కరోనా నిబంధనల కారణంగా పవన్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారని, అయినప్పటికీ పవన్ పర్యటన కొనసాగుతుందని నిన్న జనసేన వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.