USA: రాదనుకున్న ఆస్తి వందేళ్ల తర్వాత ఇప్పుడు చేతికొచ్చింది.. దాని విలువిప్పుడు రూ.556 కోట్లు!

California Governor Returns Beach Front Property To Black People After 100 Years
  • 1912లో రిసార్ట్ నిర్మించిన విల్లా, బ్రూస్
  • జాతి వివక్షతో 1924లో తెల్లజాతీయుల ఆక్రమణ
  • పార్క్ కడతామంటూ లాక్కున్న వైనం
  • బ్రూస్ వారసులకు తిరిగిచ్చేసిన కాలిఫోర్నియా గవర్నర్
ఎప్పుడో వందేళ్ల క్రితం శ్వేత జాతీయులు ఆ నల్లజాతీయుల స్థలాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇక ఆ ఆస్తి రాదనుకున్నారు వారు. అలాంటి సందర్భంలో వందేళ్ల తర్వాత ఎవరూ ఊహించని రీతిలో ఆ ఆస్తి తిరిగొచ్చేస్తే! అదే జరిగింది విల్లా, చార్లెస్ బ్రూస్ వారసులకు. లాస్ ఏంజిలిస్ కౌంటీలోని మాన్ హాటన్ బీచ్ కు ఎదురుగా ఉన్న ఆస్తిని కాలిఫోర్నియా గవర్నర్ తిరిగిచ్చేశారు. దానికి సంబంధించిన పత్రాలను విల్లా, చార్లెస్ వారసులకు అందజేశారు.


1912లో విల్లా, చార్లెస్ ఆ ప్రాంతంలో నల్లజాతీయుల కోసం ఓ రిసార్ట్ ను నిర్మించారు. బాత్ హౌస్, కేఫె, డాన్స్ హాల్ వంటి వాటినన్నింటినీ కట్టారు. అయితే, ఆ రిసార్ట్ పై అసూయతో శ్వేత జాతీయులు జాతివివక్ష చూపడం ప్రారంభించారు. 1920లో కూ క్లూ క్లాన్ దాడి చేసింది. 1924లో తెల్ల జాతీయుల బలవంతం మీద.. పార్కును కడుతున్నామంటూ 1924లో ఆ భూమిని ఆక్రమించుకున్నారు. 1929లో పూర్తిగా వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేశారు.


అయితే, కడతామన్న పార్కునూ అక్కడ కట్టలేదు. కొన్ని దశాబ్దాల పాటు అది ఖాళీగానే పడి ఉంది. 1948లో రాష్ట్రానికి, 1995లో కౌంటీకి ఆ ఆస్తి హక్కును బదిలీ చేశారు. అప్పటి నుంచి అది వారి అధీనంలోనే ఉంది. అప్పట్లో కేవలం 1,225 డాలర్లున్న ఆ స్థలం విలువ ఇప్పుడు.. 7.5 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే సుమారు రూ.556 కోట్లు. ఇప్పుడు ఆ ఆస్తిని చార్లెస్ బ్రూస్ మనవడైన ఆంటోనీ బ్రూస్ కు ఇచ్చేసిన గవర్నర్ గవిన్ న్యూసమ్.. క్షమాపణలు కూడా కోరారు. విల్లా, చార్లెస్ బ్రూస్ నుంచి నాడు ఆ భూమిని అక్రమంగా లాక్కున్నారని, తిరిగిచ్చేయాల్సిందేనని గవిన్ చెప్పారు.
USA
Beach
California
Governor
Gavin Newsom

More Telugu News