పవన్ శ్రమదానం నేపథ్యంలో: రాజమండ్రికి వెళ్లే దారుల్లో పోలీస్ చెక్ పోస్టులు.. క్షుణ్ణంగా తనిఖీలు.. ఫొటోలు ఇవిగో

02-10-2021 Sat 11:31
  • ప్రతి వాహనాన్నీ చెక్ చేస్తున్న పోలీసులు
  • ధవళేశ్వరం బ్యారేజీ మూసివేత
  • హుకుంపేటలో పవన్ శ్రమదానం.. బాలాజీపేటలో సభ
Police Check Posts Amid Pawan Srama Daanam In Rajahmundry
పవన్ కల్యాణ్ చేపట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమం సందర్భంగా పోలీసులు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీలో రోడ్ల దుస్థితిని ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో పవన్ ఇవాళ శ్రమదానం చేయనున్న సంగతి తెలిసిందే. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే, రాజమండ్రి కాటన్ బ్యారేజీపై చేసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ కార్యక్రమాన్ని హుకుంపేటకు మార్చారు. బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహణకు మాత్రం పోలీసులు నిరాకరించారు.


ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డును పోలీసులు మూసేశారు. రాజమండ్రికి దారితీసే రహదారులన్నింటివద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పంపిస్తున్నారు. ఇటు కార్యక్రమంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడ జనసేన కార్యకర్తలకు పోలీసులు నోటీసులు పంపించారు. కాగా, మొదట రాజమండ్రిలో, ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో పవన్ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే పవన్ రాజమండ్రి చేరుకున్నారు.