బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన వాణిజ్య ప్రకటనపై మండిప‌డుతోన్న నెటిజ‌న్లు!

02-10-2021 Sat 10:33
  • రోడ్లు ఉన్న‌ది ట‌పాసులు పేల్చ‌డానికి కాదంటూ యాడ్
  • సీయట్ సంస్థ‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ నెటిజ‌న్ల ట్వీట్లు
  • ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
netizens slams aamir ad

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ఓ యాడ్‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. అది మ‌తాన్ని కించ‌ప‌ర్చేలా కూడా ఉందంటూ కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సీయట్‌ టైర్ల సంస్థ ఇటీవ‌ల ఈ యాడ్‌ను విడుద‌ల చేసింది. రోడ్లు ఉన్న‌ది ట‌పాసులు పేల్చ‌డానికి కాదంటూ ఆమిర్ ఖాన్ ఈ యాడ్ లో డైలాగు చెప్ప‌డ‌మే ఇందుకు కార‌ణం.

దీంతో ఆ సంస్థ‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తున్నారు. దీపావ‌ళి పండుగ‌ను కొన్ని రోజుల్లో ప్ర‌జ‌లు జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఇటువంటి యాడ్ రావ‌డం మ‌రింత వివాదానికి దారితీస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ యాడ్‌ను వెంట‌నే తొలగించాలని సీయట్ సంస్థ‌ను డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకాపై కూడా నెటిజన్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. గతంలోనూ ఆయ‌న ఇటువంటి అంశాల‌పైనే అభ్యంత‌ర‌క‌రంగా ట్వీట్లు చేశాడని చెబుతున్నారు. అప్ప‌ట్లో జ‌రిగిన వివాదాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. పండుగను కించపర్చుతూ సీయట్‌ కంపెనీ ప‌బ్లిసిటీ ఎందుకు చేసుకుంటోంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.