పవన్ పర్యటన నేపథ్యంలో ఏపీ పోలీసుల అప్రమత్తం.. జనసేన నేతల ముందస్తు అరెస్టులు

02-10-2021 Sat 09:00
  • ఏపీలోని రోడ్ల దుస్థితిని నిరసిస్తూ పవన్ శ్రమదానం
  • పవన్ పర్యటనకు వెళ్లకుండా జనసేన నేతల గృహ నిర్బంధం
  • వేదిక మారినా పోలీసుల నుంచి రాని అనుమతి
  • సర్వత్ర ఉత్కంఠ
police house arrests janasena leaders in Rajamahendravaram

గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా జనసేన నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయించారు.

అయితే, ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఆ పార్టీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు.

ఏపీలోని రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ రాజమండ్రిలోని కాటన్ బ్యారేజీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ తొలుత నిర్ణయించారు. అయితే, జలవనరుల శాఖ ఇందుకు అనుమతి నిరాకరించడంతో వేదికను హుకుంపేటలోని బాలాజీ రోడ్డుకు మార్చారు.

ఇక్కడి కనకదుర్గమ్మ ఆలయం వద్ద సభ నిర్వహించిన అనంతరం శ్రమదానం చేయనున్నారు. అయితే, ఇందుకు కూడా ఇప్పటి వరకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జనసేన నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తూ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.