పంజాబ్‌కూ ఓ విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

02-10-2021 Sat 06:39
  • 12 మ్యాచుల్లో ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి
  • మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కేఎల్ రాహుల్
Punjab wins over KKR

బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ విజయం కోసం మొహం వాచిపోతున్న పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తానికి ఓ విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఐదు విజయాలు నమోదు చేసింది.

కోల్‌కతాను తొలుత 165 పరుగులకు కళ్లెం వేసిన పంజాబ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోమారు అదరగొట్టాడు. 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. షారూఖ్ ఖాన్ అజేయంగా 22 పరుగులు చేశాడు.  కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివమ్ మావి, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (67), త్రిపాఠి (34), నితీశ్ రాణా (31) చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ మోర్గాన్ 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. కార్తీక్ 11 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్లు తీసుకోగా, రవి బిష్ణోయ్ రెండు, షమీ ఓ వికెట్ పడగొట్టారు. 67 పరుగులు చేసిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్- ఢిల్లీ కేపిటల్స్ మధ్య షార్జాలో తొలి మ్యాచ్ (3.30 గంటలకు), రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబి (7.30 గంటలకు)లో రెండో మ్యాచ్ జరగనుంది.