శ్రమదానంతో బాపూజీకి ఘన నివాళి అర్పిస్తాం: పవన్ కల్యాణ్

01-10-2021 Fri 21:41
  • అక్టోబరు 2న గాంధీ జయంతి
  • రోడ్ల మరమ్మతులకు శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయం
  • గాంధీజీ స్ఫూర్తి తమకు శిరోధార్యమని వెల్లడి
  • లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రస్తావన
Pawan Kalyan says they will pay rich tributes to Gandhiji on his birth anniversary
అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో శ్రమదానం చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్యాయం, హింస, దురాక్రమణ వంటి కల్మషాలపై పోరాడే తత్వాన్ని భరత జాతికి అందించారని మహత్మాగాంధీని కొనియాడారు. విశృంఖలత్వంతో సాగిన దుష్టపాలనను అంతమొందించిన గాంధీజీ స్ఫూర్తి తనకు, జనసైనికులకు సదా శిరోధార్యం అని పేర్కొన్నారు.

ఆర్థికంగా, సామాజికంగా సమాజమంతా అభివృద్ధి చెందాలని బాపూజీ సర్వోదయ విధానం ప్రారంభించారని, అందులోని శ్రమదానం ముఖ్య భూమిక పోషించాలని నాడు మహాత్ముడు ప్రవచించారని పవన్ వివరించారు. నాటి ఆయన పలుకులే నేడు తమకు అనుసరణీయాలు అని స్పష్టం చేశారు. ఆ మహాత్ముని 152వ జయంతి సందర్భంగా తన పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నానని తెలిపారు. జాతిపిత స్ఫూర్తితోనే అక్టోబరు 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా రోడ్లపై శ్రమదానం ద్వారా మరమ్మతులు చేయాలని సంకల్పించామని వెల్లడించారు. ఆ స్ఫూర్తిదాతకు అదే తమ నివాళి అని వివరించారు.

ఇక, మహాత్ముడు పుట్టిన అక్టోబరు 2న మరో గొప్ప నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి జన్మించారని పవన్ అన్నారు. 1965లో మనదేశంపై దండెత్తిన పాకిస్థాన్ ను చిత్తుచేసి భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారని కొనియాడారు. నాడు ఆయన నినదించిన జై జవాన్-జై కిసాన్ నినాదం నేటికీ భారతదేశం నలుమూలలా ప్రతిధ్వనిస్తూనే ఉందని తెలిపారు. సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ నాయకునిగా ఎదిగారని, అయినప్పటికీ సామాన్యుడిగా జీవించారని కీర్తించారు. ఆ మానవతా మూర్తికి అంజలి ఘటిస్తున్నానంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.